అమరావతి: భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. పీవీ నరసింహారావుకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. క్లిష్ట సమయంలో దూరదృష్టితో ఆలోచించి దేశాభివృద్ధికి తోడ్పడ్డారని, భావి తరాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
పీవీ నరసింహారావు మహానేత: సీఎం చంద్రబాబు..
'భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నా. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. భారత అభివృద్ధి దిశను మార్చిన మహానేతగా ఆయన చిరస్మరణీయులు. పీవీ దార్శనిక నాయకత్వం, దేశాభివృద్ధికి చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆ మహనీయుడి పుణ్యస్మృతికి మరొకసారి వినమ్ర నివాళులు' అంటూ ఎక్స్ వేదికగా నివాళులర్పించారు.
ఆర్థికవేత్తగా ఎన్నో సంస్కరణలు: మంత్రి లోకేశ్
'ప్రధానమంత్రిగా, ఆర్థికవేత్తగా ఎన్నో సంస్కరణలను అమలులోకి తీసుకువచ్చి దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా. రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పీవీ నరసింహారావు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. పీవీ జయంతి సందర్భంగా రాష్ట్రానికి, దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుందాం' అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
పీవీ భారతదేశపు అత్యంత దార్శనిక రాజనీతిజ్ఞులలో ఒకరు,: పవన్ కల్యాణ్
'భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నా. భారతదేశపు అత్యంత దార్శనిక రాజనీతిజ్ఞులలో ఒకరు, అసాధారణ పండితుడు పీవీ నరసింహారావు. ఆయన నాయకత్వం మన దేశ చరిత్ర గమనాన్ని మార్చేసింది. కీలక సమయంలో ఆయన ధైర్యం, దూరదృష్టి, చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలు భారతదేశ వృద్ధికి, ప్రపంచ స్థాయిలో దాని స్థానానికి కొత్త మార్గాలను తెరిచాయి. పీవీ అద్భుతమైన మేధస్సు, పరిపాలనా నైపుణ్యం, జాతీయ ప్రగతి పట్ల అచంచలమైన నిబద్ధత శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఆయన స్ఫూర్తి ప్రతి భారతీయుడిని నిబద్ధతతో దేశానికి సేవ చేయడానికి ప్రేరేపిస్తూనే ఉండాలని ఆశిస్తున్నా' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.