బి.ఎస్.కృష్ణ (ఆల్ఫా కృష్ణ)
మద్దిలపాలెం, జూన్ 30
అక్షర చాతుర్య
అమరావతి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడిని జిల్లా పార్టీ అధికార ప్రతినిధి బి.ఎస్.కృష్ణ (ఆల్ఫా కృష్ణ) తీవ్రంగా ఖండించారు. సోమవారం మద్దిలపాలెం కృష్ణ కాలేజి రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అమరావతి ప్రాంత రైతులు ఇటీవల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.యస్.జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రభుత్వం భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటోందని, ప్రశ్నిస్తే బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీంతో వాస్తవాలు తెలుసుకునేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో జగన్ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి అమరావతికి పంపారు.
అయితే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న కమిటీపై తాడేపల్లి వద్ద కర్రలు, రాళ్లతో దాడి జరిగిందని కృష్ణ తెలిపారు. ఈ ఘటనలో ఒక పోలీసు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
"అమరావతి ఎవరి జాగీరు కాదు"
"ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ఉంది. ఆ హక్కును హింసతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. అమరావతి ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు, జాగీరు కాదు. రాష్ట్రంలో అంతర్భాగమైన అమరావతికి వెళ్లే హక్కు ప్రతి పార్టీకి, ప్రతి పౌరుడికి ఉంది" అని ఆయన స్పష్టం చేశారు.
దాడికి పాల్పడిన వారు ఏ పార్టీ వారైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయికృష్ణ అనే యువకుడి మృతిపై కూడా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, పూర్తి స్థాయి స్వతంత్ర విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలన్నారు.
"అధికారాలు శాశ్వతం కావు, కానీ రాజ్యాంగ విలువలు శాశ్వతం. ప్రభుత్వం విమర్శలను సహించాలి, రైతుల సమస్యలపై స్పందించాలి. నిజ నిర్ధారణ కమిటీపై దాడిపై నిష్పక్షపాత విచారణ జరపాలి" అని కృష్ణ కోరారు.