Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu Newsబర్మా కాందిశీకుల భూములపై కబ్జా కుట్ర ! › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 22 Jul 2026, 4:38 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 20 💬 0
Andhra Pradesh > రాజకీయాలు

బర్మా కాందిశీకుల భూములపై కబ్జా కుట్ర !

బర్మా కాందిశీకుల భూములపై కబ్జా కుట్ర !

కప్పరాడ బర్మా కాందిశీకుల భూములపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు !

పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్

భూకబ్జాదారుల కుట్రను భగ్నం చేస్తాం : కేంద్ర సంఘం

విశాఖపట్నం, జులై 5:
అక్షర చాతుర్య

కప్పరాడ 49వ వార్డు సర్వే నెంబర్ 13/1లోని బర్మా కాందిశీకుల పునరావాస భూములపై కొందరు భూకబ్జాదారులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బర్మా ఆంధ్రా కాందిశీకుల కేంద్ర సంఘం ఆరోపించింది. ఈ భూమికి సంబంధించి సోషల్ మీడియా, పత్రికల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

ఆదివారం కప్పరాడ బర్మా కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సంఘం అధ్యక్షులు మారాజు మాట్లాడుతూ, దశాబ్దాలుగా ఈ భూమి పరిరక్షణ కోసం పోరాడుతుంటే కొందరు స్వార్థపరులు దానిని కాలరాసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పత్రికలను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

788 ఇళ్లలో 600 పూర్తి

సంఘం ప్రధాన కార్యదర్శి గునుపూడి అరుణ్ బాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం బర్మా కాందిశీకుల కోసం 788 ఇళ్లను మంజూరు చేసిందని, అందులో 600 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మిగిలిన 188 ఇళ్ల నిర్మాణం పెండింగ్‌లో ఉందన్నారు.

1994 నుంచి ఈ భూమిని కబ్జా నుంచి కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నామని చెప్పారు. 2016లో అప్పటి ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, మంత్రి నారాయణ చొరవతో ఏపీటీడ్కో ద్వారా 164 ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు వచ్చాయని గుర్తుచేశారు. అయితే కొందరు భూకబ్జాదారులు తప్పుడు పత్రాలతో కోర్టుకు వెళ్లి పనులు అడ్డుకున్నారని, దీనిపై 18 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి భూమిని కాపాడుకున్నామని వివరించారు.

డబ్బులు ఇవ్వలేదనే కక్ష

బర్మా కాందిశీకుల పునరావాస సంక్షేమ సంఘం అధ్యక్షులు నారాయణ రావు మాట్లాడుతూ, భూకబ్జాదారులు ఇచ్చిన డబ్బులకు ఆశపడి నెహ్రూ నగర్, అజయ్ కలాం నగర్ కాలనీలకు చెందిన కొందరు యువకులు గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

అక్కడ ఉన్నది 1.01 ఎకరం మాత్రమే అని, కానీ 3 ఎకరాలు కబ్జా అయ్యాయని బర్మా కాందిశీకుల యువజన సంఘం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రాజేష్, దీపక్, బాబు, నర్సింహులు, శివ, వేణు, రమేష్, దేవా తదితరులు తమకు ఇళ్లు ఇవ్వాలని, లేకుంటే సంఘానికి డబ్బులు ఇవ్వాలని ఫోన్లలో బెదిరిస్తున్నారని చెప్పారు. డబ్బులు ఇవ్వనందుకు ఇళ్లను కూల్చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రక్షణ కల్పించాలి

తాము ధర్మబద్ధంగా ఉన్నందుకే తమపై బురదజల్లుతున్నారని నేతలు అన్నారు. బర్మా కాందిశీకుల యువజన సంఘం, నిరుపేద కాందిశీకుల పోరాట ఐక్యవేదిక చేస్తున్న ఆరోపణలను అధికారులు, ప్రజాప్రతినిధులు నమ్మవద్దని కోరారు.

సదరు వ్యక్తుల వల్ల సంఘం సభ్యులకు, జై భీమ్ నగర్ కాలనీ వాసులకు ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని, ఉన్నతాధికారులు స్పందించి తగిన పోలీసు రక్షణ కల్పించాలని, అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో కేంద్ర సంఘం ఉపాధ్యక్షులు గుబ్బల గౌరి శంకర్, జాయింట్ కలెక్టర్ ధారణ సత్యనారాయణ, సంక్షేమ సంఘం నాయకులు మాటూరు కిశోర్, కేశవ కృష్ణకుమార్, గోపి, శ్రీకాంత్, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.