బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి - స్పీకర్ అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం, జూలై 14
అక్షర చాతుర్య
విశాఖ ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మంగళవారం ఆయన జూను సందర్శించి అధికారులతో సమీక్షించారు.
జూ నిర్వహణలో ఆర్థిక సమస్యలు ఉన్నాయని, ఆదాయానికి, ఖర్చులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించే చర్యలు తక్షణం చేపట్టాలని సూచించారు. బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు అదనపు ఆర్థిక వనరులు సమకూర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సీఎస్‌ఆర్, ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగం
జూ అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులను అధికంగా సమీకరించాలని అయ్యన్నపాత్రుడు కోరారు. ప్రతి ఏడాది సీఎస్‌ఆర్ ద్వారా కనీసం రూ.3 కోట్లు జంతు సంరక్షణకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర ఎంపీలు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో 10 శాతాన్ని జూ అభివృద్ధికి కేటాయించాలని విజ్ఞప్తి చేయాలని అన్నారు.
తిరుపతి వంటి దేవస్థానాల నుంచి కూడా జంతు సంరక్షణ, జూల నిర్వహణకు నిధులు సమీకరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
మౌలిక వసతులు, సిబ్బంది భర్తీ
జూలో ఖాళీగా ఉన్న పోస్టులను అత్యవసరంగా భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సందర్శకులను ఆకర్షించేలా వినోద కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, మరిన్ని మౌలిక వసతులు కల్పించాలని, రోజువారీ సందర్శకుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు పెంచాలని ఆదేశించారు. అత్యున్నత ప్రమాణాలతో క్యాంటీన్‌ను అభివృద్ధి చేయాలని తెలిపారు.
ఆదాయ వృద్ధికి దోహదపడే కార్యక్రమాలను ప్రవేశపెట్టి సింగపూర్ జూ తరహాలో విశాఖ జూను అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం
జూ అవసరాలపై అధికారులు సమగ్ర నివేదికను అందజేస్తే, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జూ అభివృద్ధికి నిధుల కోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి కమిటీ తరఫున వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు.
జూ అభివృద్ధి బాధ్యత ప్రభుత్వానిదే కాకుండా అందరిపైనా ఉందని, ప్రభుత్వానికి అవసరాలను నివేదించాల్సిన బాధ్యత ఉందని స్పీకర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తాను అటవీశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కంబాలకొండను వైల్డ్‌లైఫ్ శాంక్చువరీగా ప్రకటించి ఆక్రమణలను అరికట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
సమీక్షలో జూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.