Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu Newsబోటు ప్రమాదంపై సర్కారు మౌనం ఎందుకు? › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 22 Jul 2026, 4:37 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 19 💬 0
Andhra Pradesh

బోటు ప్రమాదంపై సర్కారు మౌనం ఎందుకు?

బోటు ప్రమాదంపై సర్కారు మౌనం ఎందుకు?

జగన్ ఆగ్రహం, రూ.కోటి పరిహారం డిమాండ్

విశాఖపట్నం, జూలై 14
అక్షర చాతుర్య

మత్స్యకారుల బోటు ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు.

మంగళవారం విశాఖ జబ్బర్‌తోటలో బాధిత మత్స్యకార కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

..గంటల్లోనే ఆదుకోవచ్చు..

ఈ నెల 1న ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారని, తీరానికి కేవలం 10 మైళ్ల దూరంలోనే ప్రమాదం జరిగిందని జగన్ తెలిపారు. జులై 4న చిన్నా ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసిన కొద్దిసేపటికే బోటు మునిగిందన్నారు.

ప్రమాద సమాచారాన్ని రాత్రి 10:30కే కలెక్టర్, మెరైన్ సీఐలకు మెసేజ్ చేశారని, అయినా ఫిషరీస్ అధికారులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. "వెంటనే స్పందించి ఉంటే గంటల్లోనే మత్స్యకారులు దొరికేవారు. కోస్ట్‌గార్డ్ వెంటనే వచ్చి ఉంటే ఐదుగురైనా బతికేవారు" అని అన్నారు. ఈ నెల 5న చైనా బోటు సిబ్బంది చిన్నాను కాపాడారని చెప్పారు.

ప్రభుత్వం వేసిన త్రీమెన్ కమిటీ నివేదిక "తప్పుల తడక" అని విమర్శించారు. "తప్పు జరిగింది కాబట్టే కమిటీ వేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి మానవత్వం ఉందా?" అని నిలదీశారు.

…మంత్రులు, అధికారులపై విమర్శలు…

ఘటన జరిగిన వెంటనే ఒక్క అధికారి కూడా రాలేదని, ఉత్తరాంధ్ర మంత్రులు ఎవరూ పరామర్శకు రాలేదని జగన్ మండిపడ్డారు. ఫిషరీస్ మంత్రి సైతం బాధితులను పట్టించుకోలేదన్నారు. రాత్రికి రాత్రే స్పందించి ఉంటే ప్రాణాలు కాపాడేవారని అన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్‌గ్రేషియా "అరకొర" అని, బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడుగురు మత్స్యకారుల కుటుంబాలకు పూర్తి సాయం అందాలని కోరారు.

..మా హయాంలో భరోసా ఉండేది…

2018 పాదయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, పాకిస్థాన్‌లో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చామని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు ప్రారంభించామని, ఇప్పుడు వాటిని స్కామ్‌లతో అమ్మేస్తున్నారని ఆరోపించారు.

"మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే బాధితులను ఆదుకుంటాం. ఈ రోజు ఏపీలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. స్కూల్ పిల్లలకు పుస్తకాలు, యూనిఫాంలు లేవు. రైతు రోడ్డెక్కే పరిస్థితి. ప్రజలతో బాబు చెలగాటమాడుతున్నారు" అని జగన్ వ్యాఖ్యానించారు.