సూట్‌కేస్‌లో మృతదేహం ఉంచి ఒడిశా అడవుల్లో వదిలిన కారు డ్రైవర్
విశాఖపట్నం,జూలై 31
అక్షర చాతుర్య
వివాహేతర సంబంధం విషయంలో పెళ్లి గురించి అడిగిందన్న కోపంతో ఒక కారు డ్రైవర్ తన పరిచయస్తురాలిని హతమార్చిన ఘటన విశాఖలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆధారాలు లేకుండా చేయాలని మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి పక్క రాష్ట్రం ఒడిశాలోని అటవీ ప్రాంతంలో పడేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కంచరపాలెం దుర్గానగర్‌కు చెందిన బొలిశెట్టి సురేష్ కుమార్ (32) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి పెందుర్తికి చెందిన సంధ్య (20)తో కొంతకాలంగా పరిచయం ఉంది. ఆ పరిచయం తర్వాత ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
గత నెల 15న సంధ్య సురేష్‌ను పెళ్లి చేసుకోవాలని కోరింది. దీంతో ఆగ్రహించిన సురేష్ ఆమెతో గొడవపడి దాడి చేసి చంపేశాడు.
సూట్‌కేస్‌లో పెట్టి రైలులో తరలింపు
హత్య తర్వాత నిందితుడు జగదాంబ సెంటర్‌లో పెద్ద సైజు సూట్‌కేస్ కొన్నాడు. సంధ్య మృతదేహాన్ని అందులో ఉంచి రైలు ద్వారా ఒడిశాలోని రాయగడ జిల్లా జేకేపూర్ సమీపంలోని దట్టమైన అడవి ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేశాడు. ఆ తర్వాత ఏమీ జరగనట్టు విశాఖకు తిరిగి వచ్చాడు.
దుర్వాసనతో బయటపడిన కేసు
అడవిలో పడేసిన సూట్‌కేస్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో ఒడిశా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. రైల్వే స్టేషన్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా సురేష్ కుమార్ కదలికలు రికార్డయ్యాయి.
దీంతో ఒడిశా పోలీసులు విశాఖ పోలీసుల సహాయంతో సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన భార్యతో గొడవలు రాకుండా ఉండేందుకు పెళ్లి కోసం ఒత్తిడి తెస్తున్న సంధ్యను చంపినట్టు అతడు అంగీకరించాడు. ప్రస్తుతం నిందితుడిని ట్రాన్సిట్ రిమాండ్‌పై రాయగడ కోర్టుకు తరలిస్తున్నారు.