సింహాచలం చందనోత్సవంలో
అధికారుల 'పాసుల' రాజకీయం..!
క్షేత్రస్థాయి మీడియాపై వివక్ష వెనుక దాగి ఉన్న అసలు రహస్యమేమిటి?
సింహాద్రి అప్పన్న దర్శనం మీడియాకు లేదా ?
సింహాచలం, ఏప్రిల్ 19
అక్షర చాతుర్య
సింహాద్రి అప్పన్న చందనోత్సవం పవిత్రతను కాపాడాల్సిన దేవస్థానం అధికారులు, మీడియా నిర్వహణ విషయంలో అనుసరిస్తున్న తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. క్షేత్రస్థాయిలో ఎండనక, వాననక నిరంతరం ఆలయ పరిసరాల్లో ఉంటూ ఆలయ ప్రసిద్ధిని, మరియు భక్తుల కష్టసుఖాలను ప్రపంచానికి చాటిచెప్పే స్థానిక రిపోర్టర్లను ఈసారి ఉద్దేశపూర్వకంగా విస్మరించడం వెనుక ఉన్న కుట్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్.. మీడియాను కూడా తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూడటం అధికారుల అహంకారానికి నిదర్శనం. గతంలో ఆలయ పరిసరాల్లో జరిగిన అక్రమాలను, భక్తులకు ఎదురైన చేదు అనుభవాలను స్థానిక మీడియా ధైర్యంగా ప్రశ్నించి ప్రజావేదికపై ఉంచినందుకే, ఈసారి వారిని కవరేజీకి దూరం పెట్టాలని చూడటం కచ్చితంగా కక్ష సాధింపు చర్యే అవుతుంది.
దేవస్థానం ఈఓ మరియు పి ఆర్వోలు తమ బాధ్యతను మరచి, కేవలం తమకు అనుకూలంగా ఉండేవారికి, క్షేత్రస్థాయిలో ఎప్పుడూ కనిపించని వారికి పాసులు పంపడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? సిటీలో ఉంటూ పండుగ రోజు మాత్రమే మెరిసే వారికి రెడ్ కార్పెట్ పరిచి, ఏడాది పొడవునా ఆలయ బాగోగులను పర్యవేక్షించే స్థానిక విలేకరులను అక్రిడేషన్ లేని వారిని గేటు బయట నిలబెట్టడం ద్వారా మీరు ఏ సందేశాన్ని ఇవ్వాలని చూస్తున్నారు? ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులు ప్రజా సేవకులుగా వ్యవహరించాలి తప్ప, ఆలయ వ్యవస్థను భ్రష్టు పట్టించడం అత్యంత శోచనీయం. స్థానిక మీడియాను చిన్న పత్రికలను దూరం పెట్టడం అంటే, ఆలయంలో జరిగే అక్రమాలు, అన్యాయాలు బయటకు రాకుండా తొక్కేయాలనే కుతంత్రం కాదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
నిజాయితీగా పనిచేసే అధికారులైతే క్షేత్రస్థాయి విలేకరులను చూసి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏదో పెద్ద స్కామ్ దాచడానికే ఈ 'మీడియా ఫిల్టరింగ్' జరుగుతోందనేది స్పష్టమవుతోంది. స్థానిక విలేకరుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వారిని కవరేజీ నుంచి మినహాయించడం ద్వారా అధికారులు రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రాన్ని కాలరాస్తున్నారు. ఇప్పటికైనా దేవస్థానం ఉన్నతాధికారులు మేల్కోవాలి, జరిగిన ఈ వివక్షా పూరితమైన పాసుల పంపిణీపై తక్షణమే విచారణ జరిపి, క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి విలేకరికి గౌరవప్రదంగా కవరేజీ అవకాశం కల్పించాలనీ మీడియా ప్రతినిధులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించి పాసుల కోసం మీడియా కు దర్శనం అనుమతి కోసం అడిగితే జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సత్వర ఆదేశాలు జారీ చేసినా కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఆలయ ఈఓ చేస్తున్న నిర్వాకం పట్ల మీడియా వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.. అప్పన్న స్వామి ఆలయ ప్రవేశం మాకు లేదా ? అంటూ వాపోతున్నారు..ఇకనైన అధికారులు కళ్ళు తెరిచి మీడియాకు అనుకూలంగా శుభవార్త చెప్తారని ఆశిస్తున్నారు..