విశాఖపట్నం: ఏప్రిల్ 26
అక్షర చాతుర్య
ఆంధ్ర విశ్వవిద్యాలయ శత వసంతాల ఉత్సవాలు ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఏయూ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి.
తెలుగుజాతి మేధో అభివృద్ధికి ఏయూ కీలక భూమిక పోషించిందని విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ చంద్రమౌళి, ప్రొఫెసర్ హరిప్రకాష్ పేర్కొన్నారు. కోట్ల మందికి విద్య, ఉపాధి అందించి అంతర్జాతీయ స్థాయిలో మేధావులను తీర్చిదిద్దిన ఏయూలో చదవడం పూర్వజన్మ సుకృతమని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో భాగంగా ఏయూ ఏర్పాటుకు కృషిచేసిన స్వర్గీయ పరశురాం పాత్రో, తొలి వీసీ సి.ఆర్. రెడ్డి, మహాత్మాగాంధీ, డా.బి.ఆర్. అంబేద్కర్, సర్ సీ.వీ. రామన్, రాజా విక్రమ్ దేవ్ తదితరుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి మాట్లాడుతూ, సామాన్య విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపిన ఘనత ఏయూదేనన్నారు. అయితే ప్రైవేట్ వర్సిటీల హవా నేపథ్యంలో ఏయూ ప్రతిష్ట మసకబారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయ కోర్సులతో పాటు సాంకేతిక కోర్సులను ప్రవేశపెట్టి, బోధనా సిబ్బందిని భర్తీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విశాఖ డిప్యూటీ కలెక్టర్ ఏ. మధుసూదన్, ఏయూ ఇంచార్జ్ కంఠమరడ్డి సూర్యనారాయణ, రాజేటి బసవ కృష్ణమూర్తి, పలువురు డాక్టర్లు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.