రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల నిరసన
చిత్తూరు, ఏప్రిల్ 28: అక్షర చాతుర్య
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం వి.కోటలో దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.
వాకింగ్ చేస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు జగన్మోహన్ రెడ్డిని కత్తులతో విచక్షణారహితంగా నరికి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో ఆయనతో కలిసి నడుస్తున్న మణి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు పాల్పడింది వి.కోటకు చెందిన రౌడీ షీటర్ తమీమ్‌గా గుర్తించారు. ప్రస్తుతం కర్ణాటకలో నివాసం ఉంటున్న తమీమ్‌కు మరో వ్యక్తి సహకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
సీనియర్ జర్నలిస్టు హత్యను రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
"జర్నలిస్టుపై జరిగిన ఈ దాడి ప్రజాస్వామ్యంపై దాడి. నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి" అని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతమైతే జర్నలిజంలో ఎవరూ మనుగడ సాగించలేరని ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు పి.నారాయణ్, కార్యదర్శి జి.శ్రీనివాస్, ఏపీబీజేఏ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్ పేర్కొన్నారు.
జర్నలిస్టు హత్యకు నిరసనగా రాష్ట్రంలోని జర్నలిస్టులంతా ఆందోళన వ్యక్తం చేయాలని సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు.