చంద్రబాబు, పవన్ రాష్ట్రానికి సూర్యచంద్రులు..
--పీతల మూర్తి యాదవ్ --
"విశాఖపట్నం, ఏప్రిల్ 29:
అక్షర చాతుర్య
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు అవాకులు, చవాకులు పేలడం కాదని, దమ్ముంటే వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు రావాలని జనసేన నేత, మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సవాల్ చేశారు. బుధవారం పౌర గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి సూర్యచంద్రులని, వారిపై విమర్శలు చేసే స్థాయి వైసీపీ నేతలకు లేదని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. "గూగుల్ తెచ్చిన ఘనత మాది…గన్ కల్చర్ మీది" అంటూ వైసీపీని విమర్శించారు. వైసీపీ హయాంలో పరిశ్రమలకు సమాధి రాళ్లు పడితే, కూటమి హయాంలో పునాది రాళ్లు పడుతున్నాయని, "సమాధి రాళ్లు…పునాది రాళ్లు.. బోత్ ఆర్ నాట్ సేమ్" అని ఎద్దేవా చేశారు.
పోలవరంపై విమర్శలు: పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లపాటు వైసీపీ నేతలు నష్టపరిచారని, స్పిల్‌వేకు బీటలు వచ్చాయని, గైడ్‌బండ్ కుంగిపోయిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని స్పష్టం చేశారు. 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారని, పోలవరం పనులు వేగవంతమవుతున్నాయని తెలిపారు.
అభివృద్ధి పనుల వివరాలు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి పర్యటన అనకాపల్లి జిల్లా దార్లపూడేనని గుర్తు చేశారు. జూలై 2024లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పరిశీలించి, రూ.800 కోట్లతో విశాఖ-విజయనగరం ప్రాంతానికి నీరిచ్చే ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారన్నారు. రూ.85 కోట్లతో అనకాపల్లికి నీరిచ్చే పనుల్ని వేగవంతం చేయడం వల్లే నేడు అనకాపల్లికి మంచినీరు అందుతోందని చెప్పారు. మూడేళ్లు మంత్రిగా ఉన్న అమర్‌నాథ్ కనీసం ఒక్కరోజు కూడా ప్రాజెక్టుల్ని పరిశీలించలేదని విమర్శించారు.
"అప్పుడు బూతులు…ఇప్పుడు ట్వీట్లా?": మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్‌పై అవాకులు చవాకులు పేలిన అమర్‌నాథ్, ఇప్పుడు ఆయనపై ప్రేమ కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. పవన్‌కు సర్జరీ జరిగితే త్వరగా కోలుకోవాలని అదే అమర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారని, "అప్పుడు బూతులు…ఇప్పుడు ట్వీట్లా? బోత్ ఆర్ నాట్ సేమ్" అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోనే అత్యంత దారుణంగా ఓడిపోయిన చరిత్ర అమర్‌ది అని, అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గెలిచారని తెలిపారు. "వైసీపీ మూడు రాజధానుల నినాదం మూడు ముక్కలాట అయిపోయింది. వైసీపీ..కూటమి..బోత్ ఆర్ నాట్ సేమ్" అని పీతల మూర్తి యాదవ్ పేర్కొన్నారు.