కుటుంబ సభ్యుల ఆరోపణ…ఆందోళన..
విశాఖపట్నం, జూన్ 2
అక్షర చాతుర్య
సాధారణ చెవి శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన 13 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన విశాఖలో విషాదం నింపింది. విశాఖలోని ఆయుష్మాన్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
విజయనగరం జిల్లా వేములవలస గ్రామానికి చెందిన బాలికకు చెవికి సంబంధించిన చిన్న ఆపరేషన్ కోసం కుటుంబ సభ్యులు ఆయుష్మాన్ ఆసుపత్రిలో చేర్పించారు. శస్త్రచికిత్సకు ముందు మత్తుమందు ఇచ్చిన అనంతరం బాలిక రక్తపోటు అకస్మాత్తుగా పెరిగినట్లు వైద్యులు తెలిపారని బంధువులు చెబుతున్నారు. దీంతో ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేసి బాలికను ఐసీయూకు తరలించారు.
“24 గంటల పాటు బాలిక స్పృహలోకి రాదని డాక్టర్లు చెప్పారు. అర్ధరాత్రి సమయంలో పరిస్థితి విషమంగా ఉందని, ఇక బతికే అవకాశాలు లేవని తెలిపారు” అని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న ఆపరేషన్ కోసం తీసుకెళ్తే తిరిగి రాని కుమార్తెగా మారిందని, వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కుటుంబంలో తీవ్ర విషాదం
ఒక్కగానొక్క కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు ఆసుపత్రి ఆవరణలో విషాదఛాయలను నింపాయి. బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు.