బ్యాంక్ మేనేజర్, క్యాషియర్‌పై సుత్తితో దాడి
ఆన్‌లైన్ గేమ్‌లో 65 లక్షల అప్పు దొంగతనానికి తెగబడ్డ మరో బ్రాంచ్ మేనేజర్
స్థానికుల అప్రమత్తతతో దొరికిపోయిన నిందితుడు ..పోలీసుల అదుపులో రవికుమార్
విశాఖపట్నం, మర్రిపాలెం
అక్షర చాతుర్య
విశాఖ నగరంలోని ఐటీఐ జంక్షన్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో గురువారం పట్టపగలే దోపిడీకి దుండగుడు విఫలయత్నం చేశాడు. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్‌పై సుత్తితో దాడి చేసి నగదు దోచుకెళ్లేందుకు ప్రయత్నించగా, బ్యాంక్ సిబ్బంది, స్థానికుల అప్రమత్తతతో నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. షాకింగ్ విషయం ఏంటే, దోపిడీకి ప్రయత్నించిన వ్యక్తి బ్యాంక్ ఆఫ్ బరోడాలోనే మరో బ్రాంచ్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఎల్లా రవికుమార్ అని పోలీసులు గుర్తించారు.
సుత్తితో దాడి – మేనేజర్‌కు తీవ్రగాయాలు
పోలీసుల వివరాల ప్రకారం, ఐటీఐ జంక్షన్ బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో గురువారం ఉదయం బ్యాంకు వేళలో ఎల్లా రవికుమార్ వినియోగదారుడి వేషంలో బ్యాంక్‌లోకి ప్రవేశించాడు. లోపలికి వచ్చిన కొద్దిసేపటికే ఒక్కసారిగా సంచిలో దాచిన సుత్తిని బయటకు తీసి బ్యాంక్ మేనేజర్ శివరామరాజుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన క్యాషియర్ రమేష్‌పైనా సుత్తితో దాడి చేశాడు.
ఆకస్మిక దాడిలో శివరామరాజుకు తల, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. క్యాషియర్ రమేష్‌కు కూడా గాయాలయ్యాయి. గాయాలతోనే ఇద్దరూ నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
స్థానికుల సహాయంతో పట్టుబడ్డ నిందితుడు
నిందితుడు క్యాష్ కౌంటర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నంలో ఉండగా, బ్యాంక్‌లో ఉన్న ఇతర సిబ్బంది, లోపలికి వచ్చిన కొంతమంది వినియోగదారులు కేకలు వేశారు. శబ్దం విన్న బయట ఉన్న స్థానికులు వెంటనే బ్యాంక్‌లోకి దూసుకొచ్చి రవికుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
సమాచారం అందుకున్న పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ ఆదేశాలతో సీఐ రవికుమార్ ఘటనస్థలికి చేరుకున్నారు. గాయపడిన మేనేజర్ శివరామరాజు, క్యాషియర్ రమేష్‌ను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు.
ఆన్‌లైన్ గేమ్‌కు 65 లక్షల అప్పు – అందుకే దోపిడీ
పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. నిందితుడు ఎల్లా రవికుమార్ విశాఖలోని బ్యాంక్ ఆఫ్ బరోడా మరో శాఖలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్‌కు అడిక్ట్ అయిన రవికుమార్ గేమ్‌లలో దాదాపు 65 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడని తేలింది. ఆ అప్పు తీర్చేందుకే ఈ దోపిడీకి పథకం వేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
నిందితుడి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన సుత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రవికుమార్‌ను అదుపులోకి తీసుకుని మరింత విచారిస్తున్నారు. బ్యాంక్ సిబ్బంది చూపిన ధైర్యం, స్థానికుల అప్రమత్తత వల్ల పెనుప్రమాదం తప్పిందని పోలీసులు అభినందించారు.
ఈ ఘటన విశాఖలో కలకలం రేపింది. బ్యాంక్ ఉద్యోగే దోపిడీకి తెగబడ్డ ఘటన కావడంతో బ్యాంకింగ్ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.