Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu Newsనిబంధనలకు తిలోదకాలు ! ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ! › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 22 Jul 2026, 4:38 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 49 💬 0
Andhra Pradesh > పర్యావరణం

నిబంధనలకు తిలోదకాలు ! ప్రజల ప్రాణాలతో చెలగాటాలు !

నిబంధనలకు తిలోదకాలు ! ప్రజల ప్రాణాలతో చెలగాటాలు !

విశాఖపట్నం, జూన్ 13
అక్షర చాతుర్య ప్రతినిధి

జనావాసాల మధ్య వందలాది గ్యాస్ సిలిండర్ల అక్రమ డంపింగ్.. ఎప్పుడు పేలుతాయో తెలియని భయంతో కునుకులేని రాత్రులు.. ఇదీ విశాఖలోని కైలాసపురం, అక్కయ్యపాలెం, బిర్లా జంక్షన్, ఎన్ఏడీ, గోపాలపట్నం,పెందుర్తి గాజువాక ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో పలు జనావాస ప్రాంతాల్లో స్థానికుల నిత్య నరకం అనవచ్చు ! నగరంలో సంజయ్ గ్యాస్, విశాఖ గ్యాస్,నాగేశ్వర్ గ్యాస్,సుబ్బయ్య గ్యాస్ ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో వివిధ గ్యాస్ ఏజెన్సీల గ్యాస్ సరఫరా చేసే విధానం చూస్తే ప్రజల గుండెల్లో గ్యాస్ గుబులు కలుగుతుంది.

చట్టం స్పష్టంగా చెబుతోంది - గ్యాస్ సిలిండర్ల లోడింగ్, అన్‌లోడింగ్, నిల్వ అన్నీ జనావాసాలకు దూరంగా, అనుమతి పొందిన గోదాముల్లోనే జరగాలి. కానీ విశాఖలో ఆ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. రెసిడెన్షియల్ వీధుల మధ్య, చెట్ల నీడన, ఇళ్లకు కూతవేటు దూరంలో లారీలను నిలిపి బహిరంగంగా సిలిండర్ల మార్పిడి జరుగుతోంది. లారీలపై "HIGHLY FLAMMABLE" బోర్డులు ఉన్నా నిర్వాహకులకు, అధికారులకు చీమ కుట్టినట్లు లేదు.

అధికారుల నిర్లక్ష్యం ప్రాణాలతో చెలగాటమా?

పౌరసరఫరాల శాఖ, అగ్నిమాపక శాఖ, స్థానిక పోలీసు యంత్రాంగం కళ్లెదుటే ఈ అక్రమం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఏవైనా పెద్ద ప్రమాదం జరిగే వరకు ఎదురుచూస్తున్నారా? అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీల రాకపోకలతో రహదారులు దెబ్బతినడమే కాదు, ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ప్రజలు బతుకుతున్నారు.

ఆరోపణలు మరీ తీవ్రంగా ఉన్నాయి. వేలకు వేలు మామూళ్లు తీసుకుని గ్యాస్ ఏజెన్సీలకు అధికారులు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ద్విచక్ర వాహనాల ద్వారా జనావాసాల మధ్య నుంచే గ్యాస్ డెలివరీ జరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

తక్షణ చర్యలు తీసుకోకపోతే…

జిల్లా యంత్రాంగానికి, ఫైర్ సర్వీస్, పౌరసరఫరాల శాఖ అధికారులకు ప్రజల విన్నపం :

  1. జనావాసాల మధ్య ఉన్న అక్రమ గ్యాస్ డంపింగ్ కేంద్రాలను వెంటనే తరలించాలి.
  2. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఏజెన్సీలు, నిర్వాహకులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
  3. క్షేత్రస్థాయిలో నిఘా పెట్టి, లంచాలకు లొంగకుండా చట్టాన్ని అమలు చేయాలి.

ఒకవేళ ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు అధికారులే. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారనే ముద్ర పడుతుంది.

ఇకనైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకుంటారా? లేక విపత్తు సంభవించిన తర్వాత విచారణ కమిషన్లు వేస్తారా? విశాఖ ప్రజలు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు.