ఆహార పంపిణీతో మానవత్వం చాటిన మహిళలు
వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులే లక్ష్యం !
లయోలా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఆహార పదార్థాల పంపిణీ.
విశాఖపట్నం, అక్టోబర్ 02
అక్షర చాతుర్య
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు వృద్ధులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో లయోలా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఆహారం, పండ్లు, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
లవ్ ఇన్ యాక్షన్ (పీసీజీ & ఆర్‌సీసీజీ), మర్రిపాలెం, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీమతి జక్కల సుమతి ఆధ్వర్యంలో మహిళా సేవా సభ్యులు, నిర్వాహకులు పాల్గొని వృద్ధులకు అవసరమైన ఆహార పదార్థాలు, పండ్లు, కిరాణా సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. వృద్ధులకు అవసరమైన సమయంలో ఆహారం, ఆరోగ్య పరిరక్షణతో పాటు మానవీయమైన ఆప్యాయతను అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
సేవా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు వృద్ధులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సేవా కార్యక్రమాల ద్వారా వృద్ధులకు అవసరమైన సహాయం అందించడమే కాకుండా, వారిలో ఆత్మీయత మరియు భద్రతా భావాన్ని పెంపొందించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.
“వృద్ధుల పట్ల ప్రేమ, ఆప్యాయత చూపించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. వారికి అండగా నిలవడమే నిజమైన సేవ” అని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో సేవా సంస్థ ప్రతినిధులు, మహిళా సభ్యులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
