లీగల్ నోటీసుకు భయపడేది లేదు.
జనసేన నేత పీతల మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు
విశాఖపట్నం, జూలై 16:
అక్షర చాతుర్య
విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ – విఎంఆర్డిఏలో భారీ అవినీతి జరుగుతోందని జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.
కమిషనర్ తేజ్ భరత్, చైర్మన్ ప్రణవ్ గోపాల్ నేతృత్వంలో భోగాపురం విమానాశ్రయానికి వేస్తున్న 3 కొత్త రోడ్లపై విద్యుత్ స్తంభాల టెండర్లలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని అన్నారు. రోడ్లకు అవసరమైన అక్టోగోనల్ పోల్స్ కాకుండా, కమిషన్ల కోసం పార్కుల్లో వాడే డెకరేటివ్ పోల్స్ ను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.
ప్రధాన ఆరోపణలు:
- కమిషన్ రేటు: ఒక్కో స్తంభానికి రూ.25 వేలు, ఒక్కో లైట్ కు రూ.2500 కమిషన్ వసూలు చేస్తున్నారని ఆరోపణ.
- ధరల పెంపు: రూ.20 వేలతో ఏర్పాటు కావాల్సిన స్తంభాన్ని రూ.75 వేలకు, లైట్-కేబుల్ కలిపి రూ.1.25 లక్షలకు లెక్క చూపుతున్నారని తెలిపారు. రూ.4 కోట్ల పనికి రూ.10 కోట్ల టెండర్ పిలిచారని చెప్పారు.
- నాసిరకం కంపెనీలు: ఫిలిప్స్, క్రాంప్టన్, హావెల్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలను పక్కన పెట్టి, జస్ట్ ఎల్ఈడి, లైట్ మెన్ వంటి కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని అన్నారు. తిరుపతిలో జస్ట్ ఎల్ఈడి పోల్స్ కూలిపోయాయని, సిరిపురంలో లైట్ మెన్ పోల్స్ రంగు వెలిసిపోయాయని గుర్తుచేశారు.
- అనర్హ కాంట్రాక్టర్లు: అడివరం-శొంట్యం రోడ్డులో పాత లైన్ల తొలగింపునకు అర్హత లేని ఇలేట్ బిజినెస్ సొల్యూషన్స్ కు రూ.3.5 కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని, చంద్రా ఎలక్ట్రికల్స్ కు నిబంధనలు ఉల్లంఘించి పని అప్పగించారని ఆరోపించారు.
- ఎఫ్.డి వివాదం: విఎంఆర్డిఏకు చెందిన రూ.75 కోట్ల ఫిక్సడ్ డిపాజిట్ ను పరిధిలో లేని రాజమండ్రి కోటక్ మహీంద్రా బ్యాంకులో వేశారని, దీని వెనుక కమిషనర్ ఉన్నారని అన్నారు.
కమిషనర్ పంపిన లీగల్ నోటీసుకు భయపడేది లేదని, అన్ని ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధమని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. వెంటనే టెండర్లను రద్దు చేసి నాణ్యమైన కంపెనీలకు పనులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
