ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా
విశాఖపట్నం :
గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 29వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుర్రం కనకరావును పార్టీ అధిష్ఠానం అధికారికంగా ఎంపిక చేసింది. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో 29వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. స్థానికంగా ఏళ్ల తరబడి నివాసముంటూ, వార్డు ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో ఆయనకు ఈ అవకాశం కల్పించినట్లు అధిష్టానం పేర్కొంది.
పార్టీ అధిష్ఠానం తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని గుర్రం కనకరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు. వార్డులో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, ప్రజల అవసరాలకు ప్రాధాన్యమిస్తూ వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా సేవలందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
