విశాఖపట్నం, జూన్ 15:
అక్షర చాతుర్య
విశాఖ జిల్లాలో అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలలు, కళాశాలల ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎ. అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాయి. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి. నారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీగా తరలివెళ్లారు.
2014 నుంచి జర్నలిస్టుల పిల్లలకు కొన్నిసార్లు 100%, మరికొన్నిసార్లు 50% ఫీజు రాయితీ అమలు చేస్తున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాది అప్పటి కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం, ఈ ఏడాదికి సంబంధించిన ప్రొసీడింగ్స్ వెంటనే జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖ ద్వారా ఉత్తర్వులు తక్షణం జారీకానున్నాయి.
ఇతర డిమాండ్లు:
- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
- తెల్ల రేషన్ కార్డుదారులైన వెటరన్ జర్నలిస్టులకు సీఎస్ఆర్ నిధులతో ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లిస్తామన్నారు.
- పెన్షన్ సదుపాయం, ప్రమాద బీమా పునరుద్ధరణ అంశాలను కూడా వినతిపత్రంలో ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యదర్శి జి. శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి. రవికుమార్, ఉపాధ్యక్షులు శివప్రసాద్, నగేష్, కృష్ణమూర్తి, బ్రాడ్కాస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరావు, మదన్, స్మాల్ పేపర్స్ నేతలు జగన్మోహన్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
