సెప్టెంబర్ లోనే 39 డిగ్రీల భగభగలు, పాతాళానికి జలాలు !
మధురవాడ, సెప్టెంబరు 08
అక్షర చాతుర్య
సాధారణంగా చల్లబడాల్సిన సెప్టెంబర్ నెలలో విశాఖ నగరం నిప్పుల కొలిమిగా మారింది. ఎల్ నినో తీవ్ర రూపం దాల్చడంతో భానుడి ప్రతాపానికి తోడు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనా ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా, అంటే 91 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ఎల్ నినో పరిస్థితులు కొనసాగుతున్నాయి, ఇది మరింత బలపడనుందని IMD వెల్లడించింది. 6bd3
*ఆగస్టు 1901 తర్వాత అత్యంత వేడిగా*
గడిచిన ఆగస్టు నెల 1901 తర్వాత దేశంలోనే అత్యంత వేడిగా నమోదైంది, 16 శాతం వర్షాభావం ఏర్పడింది. దీని ప్రభావం సెప్టెంబర్ లోనూ కొనసాగుతోంది. కోస్తాంధ్రలో గత కొద్ది రోజులుగా 37 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒంగోలులో 39 డిగ్రీలు, అది సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువ. విశాఖలోనూ ఇదే పరిస్థితి.
అంతర్జాతీయ వాతావరణ సంస్థ WMO హెచ్చరిక ప్రకారం, ఈ ఎల్ నినో ఫిబ్రవరి 2027 వరకు కొనసాగే అవకాశం ఉంది, గత 50 ఏళ్లలోనే ఇది అత్యంత బలమైనది కావచ్చని అంచనా. 25a8
*మధురవాడలో నీటి సంక్షోభం*
వర్షాభావం నేరుగా మధురవాడపై పడింది.
– మేఘాలు కమ్ముకున్నా చినుకు లేదు. రుతుపవనాలు సరిగ్గా లేకపోవడంతో రిజర్వాయర్లు, మట్టసర్లోవ వంటి జలాశయాలు అడుగంటాయి.
– అనియంత్రిత బోర్ల తవ్వకంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఎండాడ ప్రాంతంలో 30.86 మీటర్లకు, మధురవాడ, నగరంపాలెం, బొట్టవానిపాలెం, స్వతంత్రనగర్, మల్లయ్యపాలెం, మిథిలాపురి, పీఎం పాలెం, బక్కన్నపాలెంలో 27 నుంచి 30 మీటర్లకు నీటి మట్టం పడిపోయింది.
– దాదాపు 90 శాతం బోర్లు మూగబోయాయి. అపార్ట్ మెంట్లలో సంప్ లు ఎండిపోయి, ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.
*కరెంటు వినియోగం పీక్స్ కు*
ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. ఏసీలు, కూలర్ల వాడకం పెరగడంతో డిమాండ్ పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
నిపుణుల హెచ్చరిక ప్రకారం, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం బలంగా ఉంది. విశాఖ వంటి తీర నగరాల్లో ఉష్ణోగ్రతతో పాటు సముద్రపు నీటి ఊటతో ఉప్పునీటి చొరబాటు ముప్పు కూడా పెరుగుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
