పద్మనాభం/మధురవాడ: ఏప్రిల్ 29
అక్షర చాతుర్య
సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆర్.ఎస్.డి.పి. అప్పల నరసింహరాజు బుధవారం తెల్లవారుజామున పద్మనాభం మండలం పాండ్రంగిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టీడీపీ శ్రేణులు, నియోజకవర్గ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు.
అప్పల నరసింహరాజు భీమిలి నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి పదవులకే వన్నె తెచ్చారు. నిస్వార్థ వ్యక్తిత్వం, నిజాయితీతో కూడిన రాజకీయ జీవితం ఆయన సొంతం. ప్రతి ఎన్నికలోనూ ఖర్చుల కోసం పూర్వీకుల స్వార్జితమైన భూమిని అమ్మేవారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
ప్రజారాజ్యం పార్టీ తరఫున అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనను అప్పల నరసింహరాజు ఇంటికి ఆహ్వానించి, కుమారుడితో టీ, కాఫీలు ఇప్పించారు. ఆ సందర్భంగా భీమిలి నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా, నిరాడంబర జీవితం గడిపిన వ్యక్తిగా అందరి మన్ననలు పొందారు.
బుధవారం ఉదయం పాండ్రంగిలోని ఆయన నివాసానికి చేరుకున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్థీవ దేహానికి నివాళులర్పించారు. నిజాయతీ రాజకీయాలకు నిలువుటద్దంగా నిలిచిన అప్పల నరసింహరాజు ప్రజలకు, పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. కుమారుడు పృధ్వీని, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
రాజకీయాలు అంటే దోచుకోవడం, దాచుకోవడం కాదని, నిబద్ధతతో ప్రజల కోసం పనిచేయడమని ఆయన జీవితం నిరూపించిందని పలువురు నేతలు నివాళులర్పిస్తూ పేర్కొన్నారు. అప్పల నరసింహరాజు స్ఫూర్తి నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని అభిప్రాయపడ్డారు.
