వెంకటాపురంలో అక్రమ నిర్మాణం !
గోపాలపట్నం, ఆగస్టు 19
అక్షర చాతుర్య
జీవీఎంసీ పశ్చిమ జోనల్ కార్యాలయ పరిధిలోని గోపాలపట్నం వెంకటపురం జనతా కాలనీ, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఓ భారీ నిర్మాణం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సుమారు 300 గజాల స్థలంలో ఎలాంటి సెట్‌బ్యాక్‌లు లేకుండా జీ+2 కమర్షియల్ భవనాన్ని నిర్మిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలు గాలికి.. పర్యవేక్షణ ఏది?
కనీస అనుమతులు, ఆమోదిత ప్లాన్ లేకుండానే పనులు వేగంగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణంపై సమాచారం ఉన్నప్పటికీ స్థానిక వార్డు ప్లానింగ్ సెక్రటరీ కళ్యాణి అలసత్వం వహించారనే విమర్శలు వస్తున్నాయి. నిర్మాణం చివరి దశకు చేరుకునే వరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎందుకు జోక్యం చేసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
‘ప్యాకేజీ’ ఆరోపణల నిగ్గు తేలేనా?
ఈ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోకపోవడం వెనుక భారీగా ‘ప్యాకేజీలు’ ఎరగా వేసారనే ప్రచారం స్థానికంగా జోరందుకుంది. అయితే, దీనిపై జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపితే తప్ప అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.
స్థానికుల ప్రధాన డిమాండ్లు:
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు వెంటనే స్థలాన్ని పరిశీలించి ప్లాన్ అనుమతులను సరిపోల్చాలి. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసి కఠిన చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్లానింగ్ సెక్రటరీతో పాటు ఇతర అధికారులపై శాఖాపరమైన విచారణ జరిపించాలి. ఈ అక్రమ నిర్మాణం వెనుక ఉన్న సూత్రధారులను, ‘ప్యాకేజీ’ ఆరోపణల వెనుక ఉన్న నిజాలను బహిరంగపరచాలి.
ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్న అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, ఈ వ్యవహారంపై జీవీఎంసీ ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
