డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడి..
అమరావతి, జూలై 27
అక్షర చాతుర్య
సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఈ మేరకు డిప్యూటీ సీఎంవో కార్యాలయం సోమవారం ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించింది. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులపై భారం తగ్గించేందుకే కూటమి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని పవన్ పేర్కొన్నారు.
ఎక్కడ, ఎంత ధరకు?
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతుబజార్లు, 500 మంది రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయాలు జరుగుతాయి.
- బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం: కేజీ రూ.52
- గ్రేడ్-1 పచ్చి బియ్యం (రా రైస్): కేజీ రూ.50
ప్రభుత్వ ఉద్దేశం
“ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం. మిల్లర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి, మార్కెట్ ధరలను సమీక్షించిన తర్వాతే ఈ ధరలు నిర్ణయించాం” అని పవన్ కల్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు.
పౌర సరఫరాల శాఖ తీసుకున్న ఈ పాలనాపరమైన నిర్ణయం వల్ల సామాన్యుల ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని, కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ నిర్ణయంతో ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
